Kapra: అందరి చూపు.. కాప్రా వైపు

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హైదరాబాద్‌ శివార్లలోని కాప్రా, ఈసీఐఎల్‌ ప్రాంతాలు పారిశ్రామిక హబ్‌గా పేరుగాంచాయి.

Updated : 14 Sep 2024 09:40 IST

రాకపోకలకు అనువైన రహదారులు
కూతవేటు దూరంలోనే రైల్వేస్టేషన్లు

కాప్రా, న్యూస్‌టుడే: గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హైదరాబాద్‌ శివార్లలోని కాప్రా, ఈసీఐఎల్‌ ప్రాంతాలు పారిశ్రామిక హబ్‌గా పేరుగాంచాయి. నగరానికి తూర్పు ఈశాన్యంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐఎల్‌), అణు ఇంధన సంస్థ (ఎన్‌ఎఫ్‌సీ), హిందుస్థాన్‌ కేబుల్‌ కంపెనీ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసర్చ్‌ (టీఎఫ్‌ఐఆర్‌) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల రాకతో ఈ ప్రాంతమంతా గణనీయంగా అభివృద్ధి చెందింది. చర్లపల్లి, కుషాయిగూడ, మల్లాపూర్, నాచారం ప్రాంతాల్లో వెలసిన పారిశ్రామికవాడలతో విస్తరించింది. పైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి కావడంతో భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. వందల సంఖ్యలో కాలనీలు పుట్టుకొచ్చాయి. దీంతో స్థలాలు దొరకడం కష్టతరమైంది. నివాస యోగ్యమైన ప్రాంతం కావడంతో స్థలాలు అత్యంత ఖరీదు కావడంతో బహుళ అంతస్తుల్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. 

షాపింగ్‌ మాల్స్, కళాశాలలు, ప్రజారవాణా వ్యవస్థలు అందుబాటులో ఉండగా.. కూత వేటు దూరంలో చర్లపల్లి, మౌలాలీ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏపీతో పాటు, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం అంటే దేశంతో పాటు విదేశాల్లో ఉన్నవారికి సైతం సుపరిచితం. ఈ నేపథ్యంలో ఇక్కడ రియల్‌ మార్కెట్‌కు మంచి గిరాకి ఉంది.

ప్రధాన రహదారులకు సమీపంలోని ప్లాట్లకు గిరాకీ..

  • ఈసీఐఎల్‌-ఏఎస్‌రావునగర్‌-సైనిక్‌పురి ప్రధాన రహదారి..
  • ఈసీఐఎల్‌-ఎస్పీనగర్‌-మౌలాలీ రేడియల్‌ రోడ్డు...
  • ఈసీఐఎల్‌-కుషాయిగూడ-చక్రీపురం-కీసర రేడియల్‌ రోడ్డు
  • ఆయా రహదారుల వెంట ప్రాంతాన్ని బట్టి స్థలాలు గజానికి రూ.లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు పలుకుతోంది. 
  • కాప్రా, సైనిక్‌పురి, ఈశ్వరపురి, హైటెన్షన్‌లైన్, కుషాయిగూడ, కమలానగర్, ఎస్పీనగర్, మౌలాలీ ప్రాంతాల్లో గజం రూ.80,000 నుంచి రూ. లక్ష వరకు ఉంది. 
  • గృహ నిర్మాణాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కొనుగోలు చేయాలంటే పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారింది. 
  • ఈ నేపథ్యంలో బహుళ అంతస్తుల్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
  • డిమాండ్‌ ఉన్న ప్రాంతం కావడంతో బ్యాంకు రుణాలు సులభంగా లభిస్తున్నాయి. 
  • ఇక్కడ ఫ్లాట్‌ కొన్నవారు తిరిగి అమ్మాలన్నా ధర బాగానే పలుకుతోంది.
  • రేడియల్‌రోడ్డు, ప్రధాన రహదారులకు దగ్గరగా ఉండే ప్లాట్లకు డిమాండ్‌ ఉంది.
  • ప్రధానంగా డబుల్‌ బెడ్‌రూం, త్రిబుల్‌ బెడ్‌రూంలకే మంచి గిరాకీ ఉంది. సింగిల్‌ బెడ్‌ రూంలు, అపార్టుమెంట్లల్లో డూప్లెక్స్‌లకు గిరాకీ లేక నిర్మాణాలు చేయట్లేదు.
  • ఇక్కడి ప్లాట్లు ఎస్‌ఎఫ్‌టీ రూ.4,000-7,000 వరకు పలుకుతోంది. 
  • వసతులు, ఆధునిక హంగులతో నిర్మాణాలు జరిగిన వాటికి గిరాకీ ఉంటోంది.
  • కొందరు బిల్డర్లు ప్రత్యేక ఆఫర్లు పెట్టి మార్కెట్‌ చేస్తున్నారు. 

ఖరీదైన ప్రాంతాలు..: ఈసీఐఎల్‌, సైనిక్‌ఫురి, ఏఎస్‌రావునగర్‌, కుషాయిగూడ, కమలానగర్‌, నేతాజీ నగర్‌, ఈశ్వరపురి, ఓయూటీ, ఆద్యిత్యనగర్‌, అయోధ్యనగర్‌, శ్రీనివాస్‌నగర్‌, నాగార్జున నగర్‌

కాలానుగుణంగా మార్పులు... 

  • జనం అభిరుచికి అనుగుణంగా ప్లాట్ల నిర్మాణంలో మార్పులు చేసుకుంటూ బిల్డర్లు ముందుకు వెళ్తున్నారు. 
  • ముఖ్యంగా యువత, మహిళలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా భవనాలు నిర్మిస్తున్నారు. 
  • కొత్తగా ఆధునిక డిజైన్లు, యువతకు కావలసినట్లు ఉడ్‌ వర్క్‌తో నిర్మిస్తున్నారు.
  • కరోనా తరువాత వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. ః అందుకు అనుగుణంగా భవనాల్లో సౌకర్యాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. 
  • ఆహ్లాదానికి పెద్దపీట వేస్తున్నారు. మొక్కలు, తోటలు, పిల్లలు ఆటలకు ప్రత్యేక స్థలాలు, రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. 
  • ప్రత్యేకంగా సీనియర్‌ సిటిజన్లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్లాట్లు నిర్మిస్తున్నారు. ః సీనియర్‌ సిటిజన్లు ఊరు బయట ఇల్లు కంటే.. అపార్టుమెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్ట పడుతున్నారు. 
  • విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు.. నగరంలో ఉండే తమ తల్లితండ్రులకు అన్ని వసతులు ఉన్న ప్లాట్లను కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతున్నారు.
  • బహుళ అంతస్తులకు నిలయంగా కాప్రా, ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి ప్రాంతాలు గుర్తింపు పొందాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని